నగుమోము కనలేని




 
ప. నగుమోము కనలేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవ రాదా? శ్రీ రఘువర నీ (నగు)

అ. నగ రాజ ధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసే వారలు కారే? టులుండుదురే? నీ (నగు)

చ. ఖగ రాజు నీయానతి విని వేగ చన లేడో?
గగనానికిలకు బహు దూరంబనినాడో?

జగమేలే పరమాత్మ! ఎవరితో మొరలిడుదు?
వగ జూపకు తాళను నన్నేలుకోరా? త్యాగరాజ నుత నీ (నగు)
వివరణ: భక్తిలో భగవద్దర్శన కాంక్ష ప్రధానమైనది. తన దైవాన్ని తప్ప ఇతర విషయాలనాశించని అవ్యాజ అనన్య భక్తికల త్యాగయ్య హృదయం ఈ కీర్తనలో ప్రకాశిస్తోంది.
నవ్వు కలిగిన రాముని ఇంకా దర్శించలేకపోయానే అన్నది అతని భాధ(జాలి). అది తెలిసి తనంత తానే రామయ్య సాక్షాత్కరించి దర్శనమివ్వడమే తనను బ్రోచుట. అందుకై అతని పరితాపం ఈ కీర్తనలో ‘పల్లవిం’చింది.
కూర్మరూపియై లోకరక్షణకోసం మందరగిరిని మోసిన సామర్థ్యం, అదేవిధంగా కృష్ణమూర్తియై గోకుల రక్షణకై గోవర్ధన గిరిని ఎత్తిన కారుణ్యం ప్రకటించిన భగవంతుడు తనను కూడా అలాగే కరుణిస్తాడనే భవం ‘నగరాజధర’ అనే సంబోధనలో ఉంది.
 అనుగ్రహానికి ఆలస్యాన్ని తాళలేని భక్తి ‘విరహాసక్తి’. భక్తవత్సలుడైన నీకు ఈ జాప్యం ఉండదు కదా! ఈ జాగుకి కారణం – నీ పరివారంలో వారు పనిగట్టుకొని(ఒగి) ఏమైనా బోధించారా? కానీ నీవారిలో అటువంటి వారు ఉండదు. అలా ఉండడానికి అవకాశం లేదు.
మహావేగవంతుడైన నీ వాహనమూర్తి గరుత్మంతుడు నీ ఆనతి విని వేగంగా పయనించలేడా? పరంధామానికీ, భూమికీ చాలా దూరమన్నాడా? జగమేలే పరమాత్మా! నీతో తప్ప ఎవరితో మొరపెట్టుకుంటాను! – అనే భావనలో అనన్యభావం స్ఫురిస్తోంది. జాగు చేసే నీ విలాసాన్ని(వగ) ఇంక ప్రకటించకు. నేనింక సహించలేను. నన్ను ఏలుకోవయ్యా!
భక్తునిపట్ల సుముఖతను తెలియజేసేదే భగవంతుని చిరునవ్వు. తన సచ్చిదానంద తత్త్వానికి అది వ్యక్తీకరణ. అలాంటి నవ్వుమోముతో స్వామి గోచరించాలనే భక్తుని తపన.
సంగీతకారులు త్యాగయ్య గారి స్వరకల్పనా నైపుణ్యాన్ని ప్రకటిస్తూ ఈ కీర్తనని ఉదహరిస్తుంటారు.

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ