వందనము రఘునందన
బంధన భక్త చందన రామ
చ1. శ్రీ-దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ (వ)
చ2. శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ-భారమా రామ (వ)
చ3. వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ (వ)
చ4. ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ-వాడను రామ (వ)
చ5. కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ (వ)
చ6. న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ (వ)
చ7. చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ (వ)
చ8. క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ (వ)
చ9. వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ (వ)
Comments
Post a Comment