శృంగారించుకొని వెడలిరి

                                
ప. శృంగారించుకొని వెడలిరి శ్రీకృష్ణుని తోనూ
అ. అంగ రంగ వైభోగముతో
గోపాంగనా మణులెంతో సొగసుగ!!శృ౦గారి౦చుకొని!!

1. నవ్వుచు కులుకుచు నొకతె కొప్పున
పువ్వుల ముడుచుచు నొకతె
దువ్వుచు కురులను నొకతె కృష్ణుని
రవ్వ జేయుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!!

2. మగడు వీడనుచు నొకతె రవికయు
బిగువున జేర్చుచు నొకతె
తగును తనకనుచునొకతె పాద
యుగముల నొత్తుచునొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!!

3. సొక్కుచు సోలుచు నొకతె కృష్ణుని
గ్రక్కున ముద్దిడునొకతె
పక్కగు రమ్మనుచు నొకతె మడుపుల-
నక్కర నొసగుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!!

4. పరిమళములందుచు నొకతె శ్రీ
హరి హరియనుచును నొకతె
ఉరమున జేర్చుచు నొకతె పయ్యెద
జరిపి వేడుకొనుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!!

5. సారసాక్షయనుచు నొకతె కను
సైగను పిలుచుచు నొకతె
రారాయనుచును నొకతె త్యాగ-
రాజ సఖుడనుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!!

ఏనోము నోచితిమో - పున్నాగ వరాళి


ప. ఏ నోము నోచితిమో చెలులమే దానమొసగితిమో
అ. శ్రీనాధు కొలువమరె చెలులు చెక్కిళ్ళునొత్తుచును
మానక మోవానుచు చంద్రానను హృదయముననుంచ!!ఏనోము!!

1. స్త్రీ రత్నములు మనము చెలులు శ్రీ మించు యౌవనము
వారిజ లోచనుడు చెలులు పాలాయె గదవమ్మ
కోరిక లీడేరను యదు వీరుని కనులార జూడ!!నే నోము!!

2. బంగారు సొమ్ములను చెలులు బాగుగ పెట్టుకొని
శృంగారాంబరములను చెలులు చెలువొంద కట్టుకొని
సంగతిగానంగములు శుభాంగునికినొసంగ మన!!మే నోము!!

3. పొంగారు యీ నదిలో చెలులు పొందుగా గుమికూడి
మంగళాకారునితో చెలులు మనసార కూడితిమి
రంగ పతియుప్పొంగుచు మన చెంగటను చెలంగగ మన!!మే నోము!!

4. వాగీశాద్యమరులకు చెలులు వర్ణింప తరమౌనే
త్యాగరాజాప్తునితో చెలులు భోగములందుచును
బాగుగ తమి రేగగను నయ రాగములీలాగు పాడ!!ఏ నోము!!

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి