గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా

                     
గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరవులేక నీ
మరుగుజొచ్చితిని అరమర సేయకు || గరుడ ||

పిలువగానె రమ్మి అభయము తలుపగానె యిమ్మి
కలిమి బలిమి నాకిలలో నీవని
పలువరించితిని నను గన్నయ్య || గరుడ ||

పాలకడలి శయన దశరధ బాల జలజనయన
పాలముంచు నను నీటముంచు నీ
పాలబడితి నిక జాలముసేయక || గరుడ ||

ఏలరావు స్వామి నను నీవేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని
ఏలరావు కరుణాలవాల హరి || గరుడ ||

ఇంత పంతమేల భద్రగిరీశ వరకృపాల
చింత లణచి శ్రీరామదాసుని
అంతరంగ పతివై రక్షింపుము || గరుడ ||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ