ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా

         
ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా

శత్రుఘ్నునకు నేను చేయిస్తి  మొలతాడు రామచంద్రా
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా

కలికి తురాయి  మెలుకుగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా

నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్రా
లేక నీ మామ ఆ జనక మహరాజు పంపెనా రామచంద్రా

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్రా

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం