వినయమునను కౌశికుని వెంట


ప. వినయమునను కౌశికుని వెంట
చనినాంఘ్రులను జూచునదెన్నటికో అందు
వెనుక రాతిని నాతి జేసిన
చరణములను జూచునదెన్నటికో (వి)
1. ఘనమైన శివుని చాపము ద్రుంచిన
పాదమును జూచునదెన్నటికో ఆ
జనక రాజు పాల కడిగినయా
కాళ్ళను జూచునదెన్నటికో (వి)
2. చనువున సీతను బొట్టు కట్టిన
కరమును జూచునదెన్నటికో
కోపమున భృగు సుతు చాప బలమందుకొన్న
బాహువు జూచునదెన్నటికో (వి)
3. వనమున చని విరాధుని చంపిన
చేతులను జూచునదెన్నటికో అల్ల
ముని జనులను కని అభయమిచ్చిన
హస్తమును జూచునదెన్నటికో (వి)
4. తనకు తానే కాకాసురుని కాచిన
శరమును జూచునదెన్నటికో
క్షణమున బహు రథముల పొడి చేసిన-
యస్త్రమును జూచునదెన్నటికో (వి)
5. ఘన బలుడైన వాలిని చంపిన
బాణమును జూచునదెన్నటికో ఆ
వనధి మద గర్వమణచిన
సాయకమును జూచునదెన్నటికో (వి)
6. కని కరమున విభీషణుని జూచిన
కన్నులను జూచునదెన్నటికో
రావణుని కొట్టి పేద కపులు లేవ జూచు
దృష్టిని జూచునదెన్నటికో (వి)
7. వన చరాధిపుని చల్లగ జూచిన
నేత్రమును జూచునదెన్నటికో
దినమును లంక వర్ధిల్లను జూచు
లోచనమును జూచునదెన్నటికో (వి)
8. ఘనమైన పుష్పకమున రాజిల్లిన
సొగసును జూచునదెన్నటికో
భరతుని కని చే పట్టుకొని వచ్చిన
వేడుకను జూచునదెన్నటికో (వి)
9. కనక సింహాసనమున నెలకొన్న
ఠీవిని జూచునదెన్నటికో వర
మునులు రాజులు కూడి సేయు
అలంకారమును జూచునదెన్నటికో (వి)
10. ఆగమ వినుతుని ఆనంద కందుని
బాగ జూచునదెన్నడో పరమ
భాగవత ప్రియుని నిర్వికారుని
రాక జూచునదెన్నడో (వి)
11. సాగర శయనుని కరుణా జల నిధిని
వేగ జూచునదెన్నడో వర
త్యాగరాజాది దేవతలు పొగడుకొన్న
లాగు జూచునదెన్నడో (వి)

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు