మీనాక్షి మే ముదం దేహి




పల్లవి: మీనాక్షి మే ముదం దేహి

మేచకాంగి రాజ మాతంగి

.మాన మాతృ మేయే మాయే
మరకతచ్ఛాయే శివ జాయే
(
మధ్యమ కాల సాహిత్యం)
మీన లోచని పాశ మోచని
మానిని కదంబ వన వాసిని

మధురా పురి నిలయే మణి వలయే
మలయ ధ్వజ పాండ్య రాజ తనయే
విధు విడంబన వదనే విజయే
వీణా గాన దశ గమక క్రియే
(
మధ్యమ కాల సాహిత్యం)
మధు మద మోదిత హృదయే సదయే
మహా దేవ సుందరేశ ప్రియే
మధు ముర రిపు సోదరి శాతోదరి
విధి గురు గుహ వశంకరి శంకరి

సరిగమపదని – స్వరశాస్త్రవేత్తలు చెప్పిన పరంగా ఒక్కొక్క స్వరం ఒక్కొక్క దానినుంచి ఉత్పన్నమైంది. ‘స’ - షడ్జమం – ఇది నెమలి యొక్క కేకాధ్వని నుంచి పుట్టింది; ‘రి’ – రిషభం – వృషభ ధ్వనినుంచి పుట్టింది; చిట్టచివరి స్వరం ‘ని’ ఏనుగు ఘీంకారం నుంచి పుట్టింది. దాని స్థానం సహస్రారం. ఏనుగు ఘీంకారం సహస్రార స్థానం గనుక అది తన వదనంలో పెట్టుకొని ఆ ఘీంకారాన్ని వినిపిస్తాడు. మూలాధార స్థానం అంటే last benchలో కూర్చున్నవాడు అని కాదు అర్థం. సహస్రార స్థానంలో శివశక్తుల స్థానం మూలాధారానికి నేరుగా ప్రసరిస్తేనే అక్కడి నుంచి దాని ప్రయాణం ప్రారంభించి శరీరాన్నంతటినీ నడుపుతుంది గనుక మూలాధారం దగ్గర ఉన్నది పై ఆరు స్థానాల సారభూతస్వరూపం. మూలాధారానికి అథసహస్రారం అని పేరు. ఆ నాదం వినగలిగితే అది సహస్రార స్థానమే. అది వింటే మోక్షమే. అందుకే ‘మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా’ అన్నారు. 

సహస్రారాంతర్గతమైన తేజమే మూలాధారంలోకి ప్రవేశించి ఒక బీజం నుంచి మొలక వచ్చినట్లుగా వచ్చి మన బ్రతుకునంతటినీ నడుపుతూ ఉంటుంది. ఒక తీగకి కుదురు ఎంత అవసరమో కుండలినీ రూపమైన తీగకి మూలాధారం అనే కుదురు అంత అవసరం. అక్కడ ఉండేవాడు గణపతి. ఆయన అక్కడ ఉంటేనే ఈ తీగ ప్రాకేది. చివరికి లభించే ఫలం మూలంలోని గట్టిదనం వల్లనే లభిస్తోంది గనుక గణపతి అనుగ్రహం వల్లనే సహస్రారాంతర్గతమైన అమృతత్త్వప్రాప్తి లభిస్తుంది.

ముత్తుస్వామి వారు గణపతిపై ఎన్నో కీర్తనలు రచించారు. అమ్మవారి భక్తుడు. వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఆయన చివరిరోజులలో ఎట్టీపాలెం అనే ఊరిలో ఉండేవారు. ఆ ఎట్టీపాలెం పాలకుడు ఒకరోజు ప్రొద్దున పూట పరుగెత్తుకు వచ్చి మా దగ్గర ఉన్న గజబలంలో ఉన్నటువంటి ప్రధాన గజం ఇవాళ ప్రొద్దుటి నుంచి తీవ్రంగా ఘీంకరిస్తోంది. ఏమిటి విషయం అని అడిగారు. ఏం ఫరవాలేదు నువ్వు వెళ్ళు అని ఆయన వెళ్ళిన తర్వాత శిష్యులందరినీ పిలిచి ‘ఏహి ముదం మే మీనాక్షి’ అనే కీర్తనని ఆలపించమన్నారు. శిష్యులతో పాటు ఆయనా పాడుతూ ‘మీనలోచని పాశమోచని’ దగ్గరికి వచ్చేసరికి ఆయన సహస్రారం చిట్లి జ్యోతి పైకి వెళ్ళి ముక్తిపొందారు. ఆ ఊరిలో ఒక సిద్ధపురుషుడు ఈరోజు సిద్ధి పొందబోతున్నాడు అని చెప్పడానికి ఏనుగు ఘీంకారం సంకేతంగా వచ్చింది అని అర్థం.

శబ్దబ్రహ్మోపాసనలో ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క దశలో వినబడుతుంది. చివరికి వినబడే శబ్దం (అనాహతనాదం) విన్నాక మరి జన్మ ఉండదు. ముక్తి లభిస్తుంది. ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఆ నాదం వినబడుతూ ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో వినబడే సాధారణ నాదములు నాదములైతే చిట్టచివరికి వినబడే నాదం ‘ఉన్నాదం’. ఈ నాద ఉన్నాదముల ద్వారా మబ్బులవలె ఆవరించిన అజ్ఞానము, మాయావణలను పటాపంచలు చేయువాడు గనుక ‘నాదోన్నాదభిన్న వలాహకః’ అన్నారు.  

(పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు - గణేశ సహస్రనామ స్తోత్ర భాష్యం)

 

 

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం