జయలక్ష్మి వరలక్ష్మి

             
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా

పాలజలనిధిలోని పసనైనమీఁగడ
మేలిమితామరలోని మించువాసన
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా

చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా

పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురుఁబోడి
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము