త్రికరణశుద్ధిగ జేసిన పనులకు

             


|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును
ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాసపడనేలా!!
 
|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి
కనకబిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్
దినకర సోమ గ్రహణకాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు
తనుతానే సిద్ధించును వూరకె దవ్వులు తిరుగగ మరి యేలా!!
 
|| హరి యను రెండక్షరములు నుడివిన అఖిల వేదములు మంత్రములు
గరిమ ధర్మశాస్త్ర పురాణాదులు క్రమమున జదివిన పుణ్యములు
పరమతపోయోగంబులు మొదలగు బహుసాధనములసారంబు
పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెదకగనేలా!!
 
|| మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తి మొక్కినమాత్రము లోపలనే
పదిలపు షోడశ దాన యాగములు పంచ మహాయజ్ఞంబులును
వదలక సాంగంబులుగా జేసినవాడే కాడా పలుమారు
మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేలా!!





Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము