తనయందే ప్రేమయనుచు విరిబోణులు



ప. తనయందే ప్రేమయనుచు విరి బోణులు
తల తెలియకనాడెదరు

అ. అనయము మోహము మీరగ కృష్ణుడు
అందరికన్ని రూపములెత్తియాడగ (త)

1. కొందరి బంగారు కొంగులు పట్ట
కొందరి పదముల బాగుగ నెట్ట
కొందరి సొగసును కనులార జూడ
కొందరి మనసు తెలిసి మాటలాడ (త)

2. కొందరియంకమునను పవ్వళింప
కొందరి పెదవుల బలు కెంపులుంచ
కొందరి తనువుల కర లీల సేయ
కొందరి వెనుక నిలిచి జడ వేయ (త)

3. కొందరి నుదుట కస్తూరి బొట్టు పెట్ట
కొందరి తళుకు చెక్కుల ముద్దు పెట్ట
కొందరి పాలిండ్ల పన్నీరు జిల్క
కొందరితో త్యాగరాజ నుతుడు పల్క (త)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము