ఆల్బమ్ - 032 మధురం మధురం

సంపుటి 2 - 137. 

01. మధురం మధురం శివచరితం శ్రీకరం సుందరం 
మనసారా పాడుకుందాం శివచరితం

సృష్టిస్థితిలయలన్నిటి హేతువు చిదానందమీ శివచరితం వేదపురాణములఖిల శాస్త్రములు వివరించినదీ శివచరితం ధ్యానము యోగము జ్ఞానము గానము అంతా తానే శివచరితం మననం స్మరణం శరణం తరణం మహనీయమ్మిది శివచరితం

కనగా కనగా కమనీయంబిది కలికలుషహరం శివచరితం 
వినగా వినగా రమణీయంబిది వేదనలనణచే శివచరితం దేవతలందరు సన్నుతిచేసే దివ్యపథమ్మిది శివచరితం పారాయణమున పరమపదమ్మిడు పరమమంత్రమయ శివచరితం

బ్రహ్మమురారిసురార్చితమైనది బహువిధ మహిమల శివచరితం జాగులు లేకనె జగద్రక్షణకు జాగృతమైనది శివచరితం 
గళమున గరళము దాల్చిన నాథుని కరుణను తెలిపెడి శివచరితం 
నాట్యవిరాజవిలాస నిలయమై నాదమయమ్మీ శివచరితం

త్రిపురాసురసంహారకమైనది తేజోమయమీ శివచరితం గంగాధరునిగ గౌరీధవునిగ శృంగారితమీ శివచరితం సగుణమ్మైనది నిర్గుణమైనది సకలము అకలము శివచరితం ఆద్యంతమ్ములు దొరకని జ్యోతిగ అవతరించినది శివచరితం

సౌరాష్ట్రమ్మున సోమనాథునిగ సాక్షాత్కారం శివచరితం శ్రీశైలమ్మున మల్లికార్జునుని చిజ్ఞ్యోతిర్మయ శివచరితం ఉజ్జయినీపురి మహాకాలునిగ ఉజ్జ్వలమైనది శివచరితం ఓంకారమ్మమలేశ్వరదీప్తిగ ఉద్భవించినది శివచరితం

ప్రజ్ఞ్వలియందున వైద్యనాథునిగ భవరోగహరం శివచరితం డాకినిలో గల భీమశంకరుని శ్రీకారుణ్యమె శివచరితం సేతుబంధమున రామేశ్వరునిగ శ్రీపతినుతమీ శివచరితం దారుకావనిని నాగేశ్వరునిగ తారకమైనది శివచరితం

కాశీనగరిని విశ్వేశ్వరునిగ  కైవల్యకరం శివచరితం 
గౌతమీతీర త్య్రంబకేశుని గరిమను తెలిపే శివచరితం హిమాలయమ్మున కేదారేశుని విమలశాంతమీ శివచరితం ఘుశ్మేశునిగా విశాలపురిలో విభవమునిచ్చిన శివచరితం 
ద్వాదశ రూపుల షణ్ముఖనుతుడై భాసిల్లినదీ శివచరితం!!

వివరణ:

శ్రవణ-మనన-కథన-మననాదుల ద్వారా ఆస్వాదనీయమైన ఆనందస్వరూపం శివచరిత్ర. దానిని మనసారా గానం చేసుకునే కృతి.

సృష్టి-స్థితి-లయలకు హేతువైన చిదానంద పరబ్రహ్మమే శివుడు. ఆ బ్రహ్మతత్త్వాన్ని వేదపురాణాది శాస్త్రాలు వివరించాయి. ధ్యాన, యోగ, జ్ఞాన, గానాలలో విస్తరించినది శివచరిత్ర. మననం చేసి, స్మరించి, ఆశ్రయించి, తరించడానికి గొప్పదైనది స్వామి గాథ.

ఆలోచించగా ఆనందాన్ని అందించడమే కాక, కలికలుషాలను తొలగిస్తుంది. శ్రవణానికి సుఖకరమే కాక, వేదనలను అణచివేస్తుంది. దేవతలందరూ చక్కగా పొగడే దివ్యమార్గమిది. పారాయణ వల్ల పరమపదాన్ని ప్రసాదించే శివుని విషయాలు గొప్ప మంత్రములతో కూడినవి.

బ్రహ్మవిష్ణ్వాది దేవతలు అర్చించే అనేక మహిమలు శివుని గాథలో ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండానే జగద్రక్షణకు సన్నద్ధుడై, కంఠాన విషాన్ని దాల్చిన కారుణ్యం, నాట్యశోభలను విలాసంగా చూపించే నాదతత్త్వం, త్రిపురాసుర సంహారం, గంగాధరలీల, పార్వతీపరిణయం... ఇలా ఎన్నో శివగాథలున్నాయి.

నిర్గుణుడు, సగుణుడు, అకలం, సకలం కూడా శివుడే. మొదలు, చివర లభించని మహాగ్నిలింగంగా అవతరించినది శివుని లీల.

సోమనాథాది జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలుగా ఆవిర్భవించిన శివగాథలు ఎన్నో శివపురాణాది గ్రంథాలలో ఉన్నాయి. ఆ శివచరితలన్నీ మధురాలే.

సంపుటి 3 - 102

02. ఎంత వింతదానవే అంతరంగమా! 
అంతుపట్టవెంతకునో సంతకూటమా!

కూడనివన్నియు నీలో కూడబెట్టుకొంటివే 
వీడలేవు వేటిని, వెనుక ముందు చూడవే 
గాఢమైన నీ లోతుల గూడులైన తపనలన్ని 
మూఢత పలుమార్లు చూసి మోహముతోనుందువే

ఏది నీకు కావలెనో నీకే తెలియనిదానవు 
ఏదీ తేల్చగలేకను ఏవో తెన్నుల పోదువు 
పాదుకున్న భావమ్మును భవానీశుపదములపై 
నాదరమున నిలుపలేవు అసలు మోదమందలేవు

స్వామి మాయలో మునిగిన చపలభావభారమా 
ఏమి యనుచు నిందింతును ఏమీ యెరుగని నిన్ను 
సోమదేవుడే యుపేక్షజూప నీదు దోసమా 
ఏమరినాడేమొ షణ్ముఖేశుడు ఓ చిత్తమా!

వివరణ:

తన మనసులోని వైరుధ్యాలను తానే తెలుసుకుంటూ, సవరించుకోలేని అశక్తతకు ఆవేదన పడుతున్న జీవుని వేదన. మాయయే కారణమని తెలిసి, మాయానియామకుడైన పరమేశ్వరుడే శరణ్యుడని భావిస్తూ, స్వామి కారుణ్యాన్ని అర్థించిన జీవుని శరణాగతి.

సంపుటి 3 - 06

03. తొలిచిందుల తెలిచాయల చలువదేవరా! 
చలివిందుల జిలిబిలి జాబిలిని దాల్చు శంకరా

పిలుపందుకు పలుకుమురా వేదగోచరా! 
నిలిచేందుకు మది యున్నది కొలువుసేయరా !

భంభమ్మను శంఖధ్వని ప్రాణమ్మె 
ఢంఢంఢం ఢక్కారుతి కంఠస్వరమై 
ధింధింధిం మద్దెలగతి హృన్నాదమ్మై 
ఝంఝణుతక జతి, నాడీ సంస్పందనమై.. 
నీ నెలవుకు సరిగా నా తనువమరించితిరా..

ఎలుగెత్తే ప్రణవమ్మే వృషభేశ్వరుడై 
శ్వాస నడల యోగములే సర్పరాజులై 
మరి మరి పిలిచే నుతులే మంజీరములై 
అభిషేకించెడి గానమె అమరగంగయై 
షణ్ముఖజనకా! నీకై సవరించితిరా!!

వివరణ:

సాధకుని శరీరంలోని చేతలే, చిత్తంలోని శివునకు కైంకర్యాలు. శివుని వాసానికి కైలాసం వలె అనువుగా తన తనువు, భావం సన్నద్ధమై ఉందని తాత్పర్యం.

సంపుటి 3 - 106

04. నాకై - నాతో - నాలో - నేనై 
ఆకాశము వలె నిండిన అచ్చమైన ఉనికివి...

విశ్వనాథ! విశ్వమూల ! విశ్వసార! విశ్వరూప! 
విశ్వాధిష్ఠాన! శివా! విశ్వాధిక! విశ్వాత్మా!

ఆత్మీయుడవీవని అరమరికలు లేక కొలిచి 
ఆత్మగ నిన్నే యెఱిగిన నాతడే ముక్తుడు 
ఆత్మానాత్మవివేకుల కాశ్రయమ్ము నీవే 
ఆత్మజ్ఞులు శివోహమను అనుభూతివి 

సేవల నీ ప్రీతికై చిత్తము చేతలును 
ఆవల ప్రియతముడవీవె అమితానందా! 
భావన నీవే షణ్ముఖభావ్యుడ వీవే 
భావాతీతుడవు నీవె భవానీధవా! భవా!

వివరణ:

ద్వైతంతో మొదలై అద్వైతంగా సిద్ధిని పొందేది భక్తి.

బ్రహ్మము 'తన కోసమే'(నాకై)ననే ప్రేమ, క్రమంగా అతని తన 'సన్నిహితుని'గా (నాతో) భావిస్తూ, తనలోనే (నాలో) ఉన్నాడనే మరింత దగ్గరితనాన్ని అనుభవిస్తూ, క్రమశః తనలో 'అహం' (నేను) స్ఫురణగా ఉన్న ఆత్మయే బ్రహ్మము అనే పూర్ణానుభవంగా మిగిలిపోతుంది.

'ఆకాశవత్ సర్వగతః సుసూక్ష్మః' (ఉపనిషత్) - ఆకాశము వలె సర్వవ్యాపకమైన, అసలైన ‘సత్’వస్తువు. ఆతడే విశ్వకర్తగా 'ఈశ్వరుడు' అని చెప్పబడుతున్నాడు.

విశ్వానికి నాథుడై, మూలమై, సారమై, విశ్వరూపుడైన ఆతడే, ‘అధ్యస్థ’మైన విశ్వానికి 'అధిష్ఠానం’గా ఉన్న బ్రహ్మము. విశ్వం కంటె అధికుడై, విశ్వానికి ఆత్మగా ఉన్నవాడు.

'ఆత్మీయుడు' (తనవాడు) అనే భక్తిభావంతో నిష్కపటంగా ఉపాసించేవానికి 'ఆత్మ'గా ఎఱుక కలిగినప్పుడు ముక్తుడౌతాడు. ఆత్మీయభావం ఆత్మానుభవంగా పరిణమించడమే ముక్తి.

ఆత్మానాత్మవివేకం కలిగినవారు మననాది సాధనలతో గ్రహించే బ్రహ్మము శివుడు. 'శివోహం' అనే బ్రహ్మజ్ఞుల సిద్ధానుభూతియే పరమాత్మ. 'ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి'(ఉపనిషత్తు) అన్నట్లుగా ప్రియతమమైన సచ్చిదానంద వస్తువే శివుడు.

భావించవలసిన బ్రహ్మతత్త్వానికి - భావించేవాడు, భావన కూడా అభిన్నమై, భావాతీతస్థితిని పొందడమే సిద్ధి.

ఆ స్థితిలోని శాశ్వతత్వమే 'భవుడు'.

సంపుటి 3 - 116

05. కప్పురపు చాయవోడ! కాలకంఠుడా! 
తప్పులెన్నబోకురా తాండవశివుడా!

నాగయ్యది యిసపు తప్పు, నగలు చేసుకోలేదా! 
బూదిదేమొ కాటి తప్పు, పూని పూసుకోలేదా! 
పులితోలుది యేట తప్పు, మొలకు సుట్టుకోలేదా! 
నా తప్పులెన్నడము నాథుడా! నీకొప్పదయా

గంగమ్మది దుముకు తప్పు, కట్టిసుట్టుకోలేదా! 
సెంద్రయ్యది మచ్చ తప్పు, సిగను పెట్టుకోలేదా! 
కొండయ్యది గట్టి తప్పు, కోరి యిల్లు కాలేదా! ఆరుమొగములయ్యకయ్య! ఆదుకోవయ్యా!

వివరణ:

కర్పూరం లాంటి తెల్లని చాయల మేనితో- నల్లనికంఠంతో ఉన్నవాడు శివుడు. విషాన్ని నిగ్రహించిన స్వామి భక్తుని దోషాలను కూడా నిగ్రహించి కరుణిస్తాడని భక్తుని 'భరోసా'. విషం కలిగిన సర్పాలను నగలుగా, శ్మశానపు బూడిదని మైపూతగా, వేటాడే (హింసాస్వభావం కల) వ్యాఘ్రపు తోలుని వస్త్రంగా, దుమికే గంగను శిరోధార్యంగా, మచ్చ ఉన్న చంద్రుని అలంకారంగా, కఠినమైన కొండను నివాసంగా స్వీకరించినవాడు, తనలోని దుస్స్వభావాలను సైతం సైరించి ఏలుకుంటాడని విశ్వాసం.

సంపుటి 3 - 69

06. శివకరము శ్రీకరము సిద్ధికర రక్ష 
కవచముగ నిలిచె నీ ఘనకృపాభిక్ష

ఓ విరూపాక్ష ! నా ఊహాపథాలలో 
నీ విలాసపు రూపు నిండైన రక్ష 
భావనాతీత! నా మానసములో వెలుగు 
నీ విమలతత్త్వమే నిర్మలపు రక్ష

నా కంఠమున మ్రోగి నాల్కపై నడయాడు 
నీ కమ్రనామమే వాక్కునకు రక్ష 
శ్రీకరా! నిను తలచి చేకొనిన భస్మమే 
సాకి నా దేహమున సమకూర్చు రక్ష

అమరవాహిని జలములభిషేకములు చేసి 
అమరికగ నిను జూడ నదియె చూపుల రక్ష 
ఉమానాథా ! షణ్ముఖోల్లాస! నీ పూజ 
కమనీయముగ నాదు కరములకు రక్ష!!

వివరణ:

శివుని దయయే రక్షాకవచం. ఊహించిన రూపం, భావించిన తత్త్వం, పలికే నామం, ధరించే విభూతి - ఇవన్నీ సాధకునకు కవచాలు.

సంపుటి 3 - 66

07. భావములో బాహ్యములో భవానీశ ! నా పూజలు 
దేవాదిదేవ! మహాదేవ ! శివార్పణములు

ఆద్యా! సద్యోజాతా! ఆవాహనము 
సాంబా! రుద్రా! భవా ! స్వర్ణాసనము 
వామదేవ! శివా! అర్ఘ్యపాద్యాచమనములు 
అఘోరా! దక్షిణాస్య! అమలాభిషేకములు

తత్పురుషా! మహేశా! తండ్రీ! బిల్వార్చనలు 
ఈశానా! ధూపమ్ములు నివిగో దీపములు 
అన్నపూర్ణాధవా! అమృతనైవేద్యములివియే 
పుష్టివర్ధనా! సుగంధి! పూర్ణపు తాంబూలంబిదిగో

మహాదిత్యవర్ణా! మంగళనీరాజనము 
అక్షరవిగ్రహ! విద్యానాయక! వాగర్చనలు 
అడుగడుగున మ్రొక్కులు హరా ! ప్రదక్షిణలు 
షణ్ముఖభావ్యా! శరణని సాష్టాంగప్రణామములు!!

వివరణ:

వివిధోపచార పూజలు భావనాత్మకములైనవి. వాటినే బాహ్యంగా ఆచరించాలి. శివార్పణం చేయాలి. సద్యోజాతాది పంచబ్రహ్మల నామాలతో, వేదోక్తమైన శివతత్త్వ చింతనతో చేసిన అర్చనావిధానం.

సంపుటి 3 -140

08. మఱపు వద్దు - నిదుర వద్దు – మనుజులార! జాగ్రత చపలత చంచలత వద్దు - జనులారా! జాగ్రత

ఇదియే జాగరణ వేళ - ఈశ్వర ధ్యానవేళ 
అన్యములకు మనసీయక అన్నిట శివునే జూచెడి 
ఎదలో శంకరరూపము మెదలే సాధన వేళ 
అంతర్ముఖదృష్టి వికసితమ్మౌ విజ్ఞాన వేళ

ఆకలిదప్పికలు మరచి - అలసట విశ్రాంతి విడచి 
జిహ్వను శంకర కీర్తన – చిత్తమున శివస్ఫురణ 
సాంద్రపు భక్త్యానందము సంభవించు దివ్యవేళ షణ్ముఖహృద్వీథిని శివచరణమ్ములు నిలచు వేళ!!

వివరణ:

ఒక శివరాత్రినాడు జాగరణ సమయంలో కలిగిన భావం. చాపల్యాన్నీ, చాంచల్యాన్నీ వదలి, అన్యచింతలు విడచి, అన్నిటిలో, తనలో శివుని చూసే అంతర్ముఖదృష్టి వికసించే విజ్ఞానమే (బ్రహ్మానుభవమే) జాగరణ.

దేహవికారాలైన ఆకలిదప్పికలు వంటివి కూడా మరచి, వాక్కుతో కీర్తన, చిత్తంలో శివస్ఫురణ పొంది, పరాభక్తితో కూడిన చిక్కనైన ఆనందానుభూతితో హృదయంలో స్థిరంగా శివపదం నెలకొనడమే జాగరణ పరమార్థం.

సంపుటి 3 - 93

09. తపముల జేసెను గౌరి కపర్ది శంకరు గోరి 
పరాశక్తి హిమగిరితనయ పరమేశుడె తలపున మెఱయ

వేసవిలో పంచాగ్నుల నడుమ 
వేసరిలు చలిని హిమ మధ్యమున 
కుంభవర్షముల నిశ్చలమ్ముగా 
అంబరకేశుడె సర్వస్వముగా...

రాజభోగముల రక్తిని వదలి 
రాకేందువదన నిరాహారియై 
అపర్ణయై అపరాజితయై 
హరమంత్రమె తన ఊపిరియై

వేడిచలువలను దుఃఖసుఖమ్ముల 
విడచి ద్వంద్వముల నిరీహయై 
స్థిరయోగమ్మున శివుని సగమ్మును 
తరుణి పొందినది షణ్ముఖజనని...

వివరణ: 

పార్వతీ తపస్సును భావించిన గీతం. శివానుగ్రహార్థం వైరాగ్యం, ద్వంద్వ సహిష్ణుత వంటి సాధనలతో, స్థిరమైన యోగంతో శివుని అర్ధభాగాన్నే సిద్ధిగా పొంది, షణ్ముఖజననిగా భాసించిన అమ్మ తపస్సును ధ్యానిస్తే సత్ఫలితాలు లభిస్తాయని పురాణవచనం.

సంపుటి 3 -139

10. ఏమీ పట్టని సామివి నీవని ఎరిగియున్న గానీ 
నిన్నే పట్టుకునున్నానయ్యా నిఖిలాంతర్యామీ!

ఉన్నవి కన్నులు మూడైనా యోగములో నరమూసినవే 
నీ లోపలనే పలులోకాలను నిత్యం చూస్తున్నావే 
కనబడలేదా నీ కంటికి నే కాసింతగనైనా 
నీ పరివారములో నెవరైనా నీతో నా గతి తెలుపగలేదా!

నిర్లేపుడవని నిరీహుడవని నిగమములాడెను నిన్నే 
బైరాగులు జోగులు నారూఢులు బాయక నీతో నున్నారే గృహగతదీపమువంటి సాక్షివి ఇహమున గల నేనేపాటి? షణ్ముఖజనకా! చెవి పెట్టెదవా! సంసారపు సడులివి నావి

వివరణ:

నిర్గుణుడు, నిర్వికారుడు పరమేశ్వరుడు. గుణాతీతులైన యోగులకు పరమార్థం ఆతడే. అటువంటి స్వామిని గుణాలతో బద్ధుడైన జీవుడు ప్రార్థించితే పట్టించు కుంటాడా? అనే సంశయం కలిగిన జీవుని భావం.

ఇందులో శివుని తత్త్వం ప్రతిపాదింపబడింది. అర్ధనిమీలిత నేత్రాలతో అంతర్ముఖంగా తపోమూర్తిగా ఉన్న శివుని ఇందులో ధ్యానించడమైనది. అటువంటి శివుడు బహిర్ముఖులను గమనిస్తాడా? అంటూనే, భక్తవత్సలుడు కనుక గమనిస్తాడని, అతనికి ఉన్న పరివారంలో(గౌరమ్మ, గణేశ, షణ్ముఖులు, నంది, భృంగి... ఇత్యాదులలో) ఎవరైనా తెలియజేస్తారని భక్తుని విశ్వాసం.

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ